అచ్చు అమృతం -1
గో గృహప్రవేశం
ఆ రోజెందుకో భళ్ళున తెల్లవారలేదు…. అది స్పెషల్ రోజైనా నింపాదిగా,నిశబ్ధంగానే మెల్ల వారింది. అలా జరిగినట్టు పక్కమీద గురక పెడుతున్న అంజికి గానీ, తన పక్కన బల్ల పైన పొర్లుతున్న గడియారానికి గానీ తెలియదు. అంజి పూర్తి పేరు ఆముదాల ఆంజనేయప్రసాద్. గడియారం పూర్తి పేరు అలారాల గడియారం. అంజి ప్రక్కన పడుకున్న శాంతమూర్తి అంజి నొక దెబ్బవేసింది, “ఏమండీ ” అన్న బీట్ తొ. అంజి నిదట్లోనే “ఊ” కొట్టాడు. ఆమె మళ్ళీ కొట్టింది. ఈ భార్యా భర్తల డ్యూయెట్ కొంత సేపు సాగాక శాంత స్వరం పెంచి “ఆఫీస్ కి టైం అయిపోతుందండీ” అంది. అంజి ఉలిక్కిపడి గడియారం వంక చూసాడు. “ఈమధ్య దీన్ని కూడా తట్టి లేపాల్సొస్తుంది” అని దాని తలపైనొక దెబ్బ వేసాడు గారంగా. అప్పుడు — భళ్ళున తెల్లవారింది.
ఆ తెల్లవారి వెలుగులో చూస్తే అది ఒక మధ్యతరగతి ఇల్లు. అంటే మధ్యన గోడ కట్టి, రెండు తరగతులుగా చేయబడ్డ ఇల్లు. ప్రస్తుతం ఒక తరగతి ఖాళీగా ఉంది శలవుల్లో స్కూల్లా. ఇంకో తరగతిలొ అంజి అద్దెకుంటూ, ఆలస్యంగానైనా ఉత్సాహంగా మో్రగుతున్న అలారం ని ఆపు చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు.
అంజి డ్యూటీ లో దిగటానికి రెడీ కాసాగాడు…. కాలంతో పందెం వేస్తున్నట్టు కాలక్రుత్యాలు తీర్చుకుని, దేవుడు ప్రత్యక్షమైపోతాడన్నంత భక్తి గా పూజ చేసి, వెంటనే ప్రమోషన్ వచ్చేస్తుందన్నంత నీట్ గా టక్ చేసుకుని……వంటింట్లోకి వెళ్ళి పొయ్యి వెలిగించాడు. పొంగకుండా పాలు కాచి, కషాయం కాకుండా కాఫీ కలిపి, వేడి తగ్గకుండా శాంత మంచం దగ్గరకి తీసుకెళ్ళాడు. ఆమెను తట్టి లేపి, “శాంత, డబల్ బెడ్ కాఫీ రెడీ!” అని అందించాడు, సన్ రైజంత నవ్వుతొ.
శాంత కాఫీ సిప్ చేస్తుంటే అంజి కిచెన్ లోకి సి్కప్ చేసి ఏప్రన్ ధరించి, ఆపరేషన్ చేస్తున్న సర్జన్ అంత నిష్టగా కాయగూరలు తరగనారంభించాడు. పిండి మదాయించాడు. గుడ్లు పగలగొట్టాడు, గరంమసాలా చితకొట్టాడు. కిచెన్ ధియేటర్ నుంచి బైటకు వచ్చి, అద్దం ముందు బొట్టు పెట్టుకుంటున్న శాంతకు గ్రాండ్ గా ఎనౌన్స్ చేసాడు, స్టేజ్ మీద మెజీషియన్లా, “బ్రేక్ ఫాస్ట్ విత్ ఆమ్లెట్ అండ్ లంచ్ బాక్స్ విత్ వెజిటెబిల్ పలావ్ రెడీ!” శాంత హడావుడిగా టిఫిన్ చేసి ఇంటి బైటకి వచ్చింది తన స్కూటీ దగ్గరికి. ఇంటి చుట్టూ స్థలం యాభై స్కూటీలు పట్టేంత ఉంది. ఒకప్పుడు ఇంకా పెద్దగా ఉండేది కాని ఆ సువిశాలమైన కాంపౌండ్ మధ్య కట్టిన గోడతో విడిపోయి ‘టు’ విశాలమైన కాంపౌండ్లుగా మిగిలింది. ఆ గోడ వైపు చూస్తూ శాంత, “అవును ఈవేళ మీ ఫ్రెండ్ అమృతరావు వాళ్ళు పక్క వాటా లో దిగుతారన్నారు?” అని అంజిని అడిగింది కుతూహలంగా. గుడ్ బై చెప్పటానికి వచ్చిన అంజి గడియారం చూసుకుని చిన్న ముల్లు గుచ్చుకున్నట్టు ఎగిరి, “అరె వాడు అరగంట క్రితమే రావాలే….వాడెప్పుడు ఇంతే, యమ సో్ల. చిన్నప్పుడు రోజూ స్కూల్ బస్ మిస్ అయ్యేవాడు. మన పెళ్ళప్పుడు పెళ్ళి బస్ మిసయ్యాడు, వాళ్ళాఫీసు లో యేటా ప్రమోషన్ బస్ మిస్సవుతాడు. ఏంటొ వాడికి నా చురుకుదనం రాలేదు,” అన్నాడు విచార గర్వంతో. “నాకాఫీసుకి లేటవుతుంది” అని శాంత స్కూటీ ఎక్కి వెళ్ళిపోయింది పొగ, కుతూహలం అంజికి వదిలేసి. శాంత వైపు చెయ్యి ఊపి గోడ వైపు కాళ్ళు కదిపాడు అంజి. ఒక్క ఉదుటున గోడ ఎక్కి రెండో ఉదుటున పక్క వాటా కాంపౌండ్ లోకి దూకాడు. తన వాటా లో గేటు తెరుచుకుని బయటకు వెళ్ళి యు-టర్న్ తీసుకుని ప్రక్క వాటా గేటు తీసుకుని ప్రవేశించవచ్చు. గేటులు కనిపెట్టింది కూడా అందుకే.కాని అంజి నిల్ గేట్స్ సిద్దాంతం నమ్మినవాడు. తన మైండ్ కి ఎల్లలు లేవు. వెళ్ళి పక్క వాటా గేటు తెరిచి రోడ్డు వైపు చూసాడు. అమృతరావు జాడలేదు.
sir plz continue..
its my fav n fav serial from childhood..
will be very exciting if i can read all the episodes in a book..
thnq sir !!
sir millions of people waiting for amrutham new session
Sir, ipudey 1st episode chusanu, Beautiful 👌.. Entry scene..Good old days are back…❤
Excellent and an extraordinary word framing 👏👏