ఒక యుగం ముగిసింది. నిర్మాతే సినిమా కి మూలవిరాట్టైన యుగం. దానికి యుగపురుషుడు రామానాయుడు గారు. ఎందుకంటే ఆయన ఆత్మబలం, ఉత్సాహం, అసమానం.
కొన్ని దశాబ్దాల క్రితం డి వి నరసరాజు గారు ఒక కొత్త పంధా కద్ధ తయారు చేసారు, హీరో కి డ్యుఅల్ రోల్ తో. చాలా మంది నిర్మాతలు చాలా బాగుందన్నారు. కాని సినిమా తీయటానికి జంకారు. మూడు నాలుగేళ్ళు అలాగే పడివుంది, పూర్తిగా రెడీ ఐన ఆ స్క్రిప్టు. అప్పుడే ఒక కొత్త బేనర్ స్థాపించిన ఇరవైఏడు సంవత్సరాల యువకుడు ఆది వెండి తెరకెక్కించడానికి ముందుకుదూకాడు. వెండి తెర ఒక బంగారు చరితకు నాంది పలికింది. ఆ సినిమా పేరు ‘రాముడు-భీముడు.’ ఇప్పటికి వో డజను సార్లు రీమేక్ ఐంది. ఆ చొరవ, విశ్వాసం గల కుర్రాడే రామానాయుడు.
సాధారణంగా నిర్మాతలు వంద రోజులాడే సినిమాలు తీయటం విజయానికి తార్కాణమని భావించేవారు. కాని ఈయన గురి మిగిలిన వారికి కనుచూపు మేరలో లేని గమ్యం; వంద సినిమాలు నిర్మించటం. అది చేరారు, దాటేసారు. ప్రపంచంలో ఇది సాధించిన వారు వేరెవరూ లేరు.
రామానాయుడు గారు చాలా బిరుదులు సత్కారాలు పొందారు. కాని ఆయన పేరు కూడా బిరుదులా నిలుస్తుంది, మానవ సాధన కు మహోన్నతమైన ఉదాహరణగా; ఒక రాముడిలా, ఒక భీముడిలా, ఒకే ఒక నాయుడిలా.
అవునండి. నిజంగా గొప్ప వ్యక్తి.