‘మహానటి’. ‘ఓ సీత కథ నుంచి ఒకే వొక సావిత్రి కథ వరకు కూర్చిన ‘వైజయంతి’మాల లో ఇది ఎప్పటికీ మెరిసే ఆణిముత్యం.
ఇలాంటి అనుభూతి అపూర్వం. తెలుగు సినిమాకు తరతరాలు తరగని సంపద అందించిన ఎందరో దిగ్గజాల తో మూడు గంటలు సన్నిహితంగా గడిపాం. కె.వి. రెడ్డి, ఎల్.వి. ప్రసాద్, చక్రపాణి, బి.నాగి రెడ్డి, సింగీతం, పింగళి, ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్ — వీరి మధ్య అన్ని దిక్కులు మిరిమిట్లు గొలిచేలా వెలిగిన అపురూపమైన తార; సావిత్రి.
తెరపై సావిత్రి అందరికీ తెలుసు; తెరవెనుక సావిత్రి మనకి పరిచయభాగ్యం లేదు. ఇన్నాళ్ళకి, ఈ మహా మనిషి తో ఆమె పసితనం నుంచి ప్రయాణించాం… చివరి దశ వరకు. ఈ కనిపించని జీవితానికి కీర్తి సురేష్ రూపం ఇచ్చింది. కేవలం బాహ్య రూపం కాదు. ఒక గొప్ప శిల్పి శిల్పం చెక్కితే ఏది ప్రతిమ, ఏది నిజ స్వరూపం తెలియదంటారు. కీర్తి, సావిత్రి గా తన ఆత్మను చెక్కుకుంది.
సావిత్రి పాత్ర పరిచయం తోనే ఆకట్టుకోబడతాం. ఒక కంటినుంచి మాత్రమే మూడు కన్నీటి బొట్లు రాల్చడం. అక్కడ విస్తుపోయి చూసి చప్పట్లు కొట్టిన యూనిట్ లాగే మనకీ తియేటర్ లో నించుని తప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కాని, ఆ కథ ముగింపు వరకు ఎన్నో సంధర్భాల్లో గుండె లో పొంగివచ్చే వరద బయటకు పారటానికి రెండు కళ్ళూ చాలవనిపిస్తుంది. ఒక హాలీవుడ్ తార (సూసన్ హేవర్డ్) సావిత్రి కి ప్రగాఢ అభిమానై, ఆమె ప్రతిభ ప్రపంచం లోనే అసామనమని పొగుడుతూ లేఖలు రాసిన సంఘటన కూడా చేర్చి వుంటే ఇంకెంతో ఉత్తేజంగా వుండేదేమో. పారే కన్నీటి లో ఆనంద భాష్పాలు సంగమించేవేమో.
సూటి గానే, కాని సరళంగా చిన్న మాటలతోనే పెద్ద అర్ధాలు పలికించిన సాయి మాధవ్, 1980’స్ కాదు, 1950-60’స్ ఈ కథ హీరో అని చూపించిన ఛాయాగ్రహకుడు, దుస్తులు, మొత్తంగా నిర్మాణ రూపకల్పన — అన్నీ, అందరూ అలనాటి ప్రపంచాన్ని సృష్టించారు. సినిమా ఐపోయాకా, ఇంటర్వెల్ లో కూడా, ఆ వాహిని లోంచి బయటకు రావాలనిపించలేదు.
ఇలాంటి ఊహ రావటం, ఆ ఊహను ఊహాతీతంగా తీయగల ప్రతిభ దర్శకుడికి వుండటం, ఆ కలని ఎన్ని రోజులు పట్టినా, ఎంత ఖర్చైనా, ‘హీరో’ లేకపోయినా వెనకంజ వెయ్యకుండా సాకారం చెయ్యగల నిర్మాత వుండటం — అద్భుతం. ఇలాంటి దర్శక-నిర్మాత యుగళ గీతం సాగినన్నాళ్ళూ సినిమాల్లో మేజిక్ వుంటూనే వుంటుంది.
‘మహానటి’ మొన్నటి వరకు సావిత్రి కి బిరుదు; ఇప్పటినుంచి అశ్విన్ కి కిరీటం కూడా.